లింగాష్టకం తెలుగు

No. of Pages4
Download Size736 KB
Category Religious Books

లింగాష్టకం తెలుగు - Preview

Lingashtakam Read Online / Preview
0 likes
share this pdf Share
report this pdf Report

లింగాష్టకం తెలుగు - Summary

Lingashtakam is an eight-verse stotram dedicated to the worship of lord shiva in his “Linga” form and you can download the Lingashtakam Telugu PDF can be download from the link given at the bottom of this page.

Lingashtakam Lyrics in Telugu with Meaning

లింగాష్టకం

బ్రహ్మమురారిసురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగమ్ |
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౧ ||

అర్థం – ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వమను శోభతో కూడి యున్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడియున్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహం కరుణాకర లింగమ్ |
రావణదర్పవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౨ ||

అర్థం – ఏ లింగమును దేవతలయొక్క ఋషులయొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగియున్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వసుగంధసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగమ్ |
సిద్ధసురాసురవందిత లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౩ ||

అర్థం – ఏ లింగము అన్నిరకముల సుగంధములచే అద్దబడియున్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై యున్నదో, ఏ లింగము సిద్ధులు, దేవతలు, అసురుల చే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కనకమహామణిభూషిత లింగం
ఫణిపతివేష్టితశోభిత లింగమ్ |
దక్షసుయజ్ఞవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౪ ||

అర్థం – ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడియున్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి యున్నదో, ఏ లింగము దక్ష యజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగమ్ |
సంచితపాపవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౫ ||

అర్థం – ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి యున్నదో, ఏ లింగము తామరపువ్వుల హారముతో అలంకరింపబడియున్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

దేవగణార్చితసేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకరకోటిప్రభాకర లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౬ ||

అర్థం – ఏ లింగమును దేవగణములచే భావముతో, భక్తితో పూజింపబడుచూ సేవింపబడుచూ ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగమ్ |
అష్టదరిద్రవినాశన లింగం
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౭ ||

అర్థం – ఏ లింగము ఎనిమిది రెక్కల పువ్వులను చుట్టూ కలిగియున్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై యున్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్పసదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం [** పరమపదం **]
తత్ప్రణమామి సదా శివ లింగమ్ || ౮ ||

అర్థం – ఏ లింగము సురులయొక్క గురువు (బృహస్పతి) మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చనచేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైనదానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో యున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను.

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

అర్థం – లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని (లింగం) దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు.

(ఈ అర్థము మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది)

లింగాష్టకం తెలుగు PDF Download